2300 కి.మీ.ల మజిలీకి చేరుకున్న యువగళం! వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శిలాఫలకం
వినుకొండ నియోజకవర్గంలో ఉత్సాహంగా పాదయాత్ర
వినుకొండ: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 174వరోజు యువగళం పాదయాత్ర గురువారం నగరాయపాలెం క్యాంఫ్ సైట్ నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వంపై సమరభేరి మోగిస్తూ జనప్రభంజనమై సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద 2300 కి.మీ. మైలురాయికి చేరుంది. ఈ సందర్భంగా వరికపూడిశెల ప్రాజెక్టుకు హామీ ఇస్తూ యువనేత లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అంది పల్నాడు ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుంది. బొల్లాపల్లి మండలంలో ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలుసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించుకున్నారు. మరికొద్ది నెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. నగరాయపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొండ్రుముట్ల, సత్యనారాయణపురం, కొచ్చెర్ల, అంగలూరు మీదుగా వనికుంట విడిది కేంద్రానికి చేరుకుంది. 174వరోజు యువనేత లోకేష్ 13.9 కి.మీ.లు పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2313.5 కి.మీ. మేర పూర్తయింది. సాక్షి తప్పుడు కథనాలపై మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న కారణంగా 4-8-2023న లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. 5వతేదీ ఉదయం వనికుంట నుంచి యథావిధిగా పాదయాత్ర ప్రారంభమవుతుంది.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
నాపై బ్రహ్మనాయుడు 5 అక్రమ కేసులు పెట్టించాడు -ఆరెకట్ల వాసుదేవరెడ్డి, గుమ్మనంపాడు గ్రామం
1983 నుండి తెలుగుదేశంపార్టీ అభిమానిని. ప్రస్తుతం నా వయస్సు 74సంవత్సరాలు. 2021లో వినాయక నిమజ్జనానికి మేం ట్రాక్టర్లు పెడితే వాటిని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. TDP కార్యకర్తలపై రాళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో నేను సర్ధిచెప్పడానికి వెళితే నాతో పాటు 15మందిపై 307కేసులు పెట్టారు. బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయినప్పటి నుండి నాపై అక్రమంగా 5కేసులు పెట్టించాడు. 2014 సమయంలో నరేగా పనులు చేశాను. వాటికి సంబంధించిన రూ.40లక్షలు పెండింగ్ లో పెట్టారు. రెండు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి పనులు చేయడంతో అసలు, వడ్డీ కలిపి బాకీ రూ.80లక్షలకు పెరిగింది. అప్పుల బాధ భరించలేక పూర్వీకుల నుండి వస్తున్న భూమి అమ్మి బాకీ తీర్చాను.
30ఇళ్లకు ఒక బోరు పంపు మాత్రమే ఉంది -హసీనా, కొండ్రుముట్ల నిశ కాలనీ.
మా ప్రాంతంలో 30ఇళ్లు ఉన్నాయి. మా ఇళ్లన్నింటికీ కలిపి కేవలం ఒక బోరు పంపు మాత్రమే ఉంది. అది చెడిపోతే పక్కవీధుల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. పంపు చెడిపోతే వారం రోజుల వరకు పట్టించుకునే నాధుడులేడు. వైసీపీ అధికారంలోకి వస్తే ఇంటింటికీ నీటి కుళాయిలు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అడిగితే పట్టించుకోవడం లేదు. డ్రైనేజీలు ఏర్పాటుచేయకపోవడం వల్ల మురుకినీరు వీధుల్లో ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఉంటున్న ఇళ్లకు పట్టాలు లేవు, ఓటీఎస్ కట్టించుకుని పట్టాలు ఇవ్వలేదు. పూర్వీకులు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నాం. ఒక్కో ఇంట్లో 3 కాపురాలు ఉంటున్నాం. స్థలాలు, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే మా సమస్యల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇళ్లు ఉన్నవారికే స్థలాలు ఇచ్చారు -రమణమ్మ, కొండ్రుముట్ల గ్రామం
మా గ్రామంలో వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. ఇళ్ల స్థలాలు లేనివారికి కాకుండా సొంత ఇళ్లు ఉన్నవారికే స్థలాలు ఇచ్చారు. సచివాలయంలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించకోలేదు. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లల్లో పెన్షన్లన్నీ తీసేశారు. తమకు నచ్చిన వారికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అర్హత ఉన్నవారికి కూడా చేయూత పథకం నిలిపేశారు. డ్రైనేజీల్లో పూడిక తీయడం లేదు. దీంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది.
అజయ్ రెడ్డి, సాక్షిలపై లోకేష్ మరో న్యాయపోరాటం
అసత్యకథనాలపై క్రిమినల్ కేసులు దాఖలు
పాదయాత్రకి 4న విరామం…మంగళగిరి కోర్టులో వాంగ్మూలం
అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి, కట్టుకథలతో ఆరోపణలు చేసిన అప్పటి స్కిల్ డెవలప్మెంటు చైర్మన్ అజయ్ రెడ్డిలపై టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులను దాఖలు చేసిన లోకేష్, వాంగ్మూలం నమోదుకు శుక్రవారం(4-8-2023)న కోర్టుకు హాజరు కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతున్న యువగళం పాదయాత్ర నుంచి గురువారం రాత్రి ఉండవల్లి నివాసానికి చేరుకుని, శుక్రవారం ఉదయం మంగళగిరి కోర్టుకి లోకేష్ హాజరవుతారు.
స్కిల్ డెవలప్మెంటులో భారీ స్కాం అంటూ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి 2022లో ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్‌పై అసత్య ఆరోపణలు చేశారు. తనకు సంబంధంలేని అంశంలో చేసిన ఆరోపణలపై లోకేష్ తన న్యాయవాదులతో అజయ్ రెడ్డికి నోటీసులు పంపారు. ఆటునుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో తన పరువుకి భంగం కలిగించిన అజయ్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. “స్కిల్ స్కాంపై ఈడీ కొరడా“ పేరుతో 2022 డిసెంబర్ నెలలో సాక్షిలో ఓ కట్టుకథతో కథనం వేశారు. వాస్తవంగా జీఎస్టీ అవకతవకలకి పాల్పడిన కంపెనీలకి ఈడీ నోటీసులు ఇస్తే, దానిని స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుతో అప్పటి టిడిపి ప్రభుత్వం, నాటి మంత్రి లోకేష్‌కి ఆపాదిస్తూ అసత్యాలు అచ్చువేసి వదిలేశారు. దీనిపై సాక్షికి తన న్యాయవాదులతో నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న సాక్షి పత్రిక ఎటువంటి వివరణ వేయకపోవడం, తిరుగు సమాధానం ఇవ్వడం గానీ చేయలేదు. తన పరువుప్రతిష్టలకి భంగం కలిగించిన సాక్షిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ మంగళగిరి కోర్టులో లోకేష్ వాంగ్మూలం ఇవ్వనున్నారు.
అంగలూరులో అరటిపంటను పరిశీలించిన లోకేష్
వినుకొండ నియోజకవర్గం అంగలూరు వద్ద అరటితోటవద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న అరటిగెలలను యువనేత లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా అరటి రైతు శ్రీనివాసరావు తన కష్టాలను చెబుతూ… జి-9రకం అరటి 3ఎకరాలు సాగుచేశాను, 3లక్షల పెట్టుబడి పెడితే ఎకరాకు రూ.20వేల చొప్పున రాబడి వచ్చింది. టన్ను 30వేలు పలకాల్సిన పంటను కొనుగోలుదార్లు రాక రూ.3వేలకు అమ్ముకున్నాను. మరో రెండెకరాల్లో జామతోట వేస్తే పురుగుపడి కాయ చెడిపోయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి బీమా సొమ్ము అందడం లేదు. ఏటేటా నష్టాలతో వ్యసాయం చేయడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
నారా లోకేష్ మాట్లాడుతూ
వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి ఉండటం వల్లే రైతులకు ఇన్ని కష్టాలు. కష్టకాలంలో అన్నదాతలకు అండగా నిలవాల్సిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి బయటకు రావడం లేదు. టిడిపి హయాంలో ఉద్యానవన రైతులకు డ్రిప్, ఇన్ పుట్ సబ్సిడీలతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాం. అనంతపురం, కర్నూలు జిల్లాలనుంచి విదేశాలకు అరటి, చీనీపంటల ఎగుమతికి చేయూతనిచ్చాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఉన్న రకాలను రైతులను ప్రోత్సహించాల్సి ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చాక హార్టీకల్చర్ పంటలకు రాయితీలు, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. మరో 9నెలలు ఓపికపట్టండి, మీకోసం పనిచేసే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తారు.
నారా లోకేష్ ను కలిసిన సత్యనారాయణపురం గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం సత్యనారాయణపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో స్మశానవాటిక లేక అంత్యక్రియలు చెరువుల, పొలాల్లో చేయాల్సి వస్తోంది. గ్రామంలో మురుగునీటి కాల్వలు లేవు. వర్షాకాలం వస్తే దోమలబెడద తట్టుకోలేకపోతున్నాం. పొలాలకు వెళ్లేందుకు దారి లేక రైతులు, కూలీలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో శుభకార్యాలు జరుపుకోవడానికి కమ్యూనిటీ హాలు నిర్మించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
వైసిపి నాయకులకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజాససమస్యలపై శ్రద్ధలేదు. అధికారంలోకి వచ్చాక గ్రామాలను పూర్తిగా గాలికొదిలేశారు. పంచాయతీలకు చెందిన కేంద్రం విడుదల చేసిన రూ.9 వేల కోట్లు వైసిపి ప్రభుత్వం దొంగిలించింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామసీమల అభివృద్ధికి పెద్దపీట వేస్తాం. రోడ్లు, డ్రైనేజి, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. సత్యనారాయణపురంలో స్మశానవాటికకు స్థలం కేటాయిస్తాం. పొలాలకు వెళ్లే పుంతరోడ్ల నిర్మాణం చేపట్టి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన కొచ్చర్ల గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం కొచ్చర్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో 5,500 జనాభా ఉంది. శుభకార్యాలు జరుపుకోవడానికి మండపం నిర్మించాలి. గ్రామంలో డ్రైనేజీ అస్తవ్యస్థంగా ఉంది. సురక్షిత నీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి. ఎస్సీలకు కమ్యూనిటీ హాలు నిర్మించాలి. అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతున్నాయి, వాటిని పేదలకు అందించాలి. పేదలకు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గుక్కుడు నీళ్లివ్వలేని అసమర్థుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యం. జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నిధులిచ్చి వాటా సొమ్ము చెల్లించలేక పథకాన్ని అమలుచేయలేని చేతగాని ప్రభుత్వమిది. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. కబ్జాకు గురైన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం. ఇల్లులేని ప్రతి పేదవాడికి ఇంటిస్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తాం.
నారా లోకేష్ ను కలిసిన అంగలూరు గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం అంగలూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 2వేల మంది జనాభా నివసిస్తున్నారు. 80శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామం పరిధిలో అగ్రహారాల క్రింద 1,254 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా భూములకు ప్రతియేటా పన్నులు చెల్లిస్తున్నాం. ఈనాం భూములు కావడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా భూములకు సమగ్ర సర్వే చేయించాలి. నిషేధిత జాబితా నుండి మా భూములను తొలగించి పట్టాలు ఇప్పించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
ఈనాం భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సమస్య ఉంది. అధికారంలోకి వచ్చాక సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవ అనుభవదారులను గుర్తిస్తాం. దీర్ఘకాలంగా భూములను సాగుచేసుకుంటున్న వారికి రుణాలిచ్చేలా బ్యాంకర్లతో చర్చిస్తాం. నిబంధనలకు లోబడి న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన వనికుంట గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం వనికుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 500కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామస్తులంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. పిల్లలను చదివించుకోవడం కూడా కష్టంగా మారింది. మా గ్రామంలో మంచినీటి సమస్య అత్యధికంగా ఉంది. ఫ్లోరైడ్ నీటి వల్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. గత నాలుగేళ్లుగా మా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రరైతాంగాన్ని అప్పుల్లో ముందువరసలో నిలిపారు. గతంలో రూ.75వేల ఉన్న ఎపి రైతుల సగటు అప్పు, ఇప్పుడు 2.5లక్షలకు చేరింది. రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానన్న ఎన్నికల తర్వాత ముఖం చాటేశారు. టిడిపి అధికారంలోకి రాగానే పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతిఇంటికీ కుళాయి అందించి స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.
Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh