క్రోసూరులో కదంతొక్కిన యువగళం పాదయాత్ర! దారిపొడవునా యువనేతకు నీరాజనాలు… వినతుల వెల్లువ
నేడు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి యువగళం
పెదకూరపాడు: జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్నNara Lokesh యువగళం పాదయాత్ర పెదకూరపాడు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 181వరోజు యువనేత లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. క్రోసూరులో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. అడుగడుగునా మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పడుతూ ఆత్మీయస్వాగతం పలికారు. భారీ గజమాలలతో యువనతను గ్రామాల్లోకి ఆహ్వానించారు. క్రోసూరు ప్రధాన రహదారి జనంతో కిటకిటలాడింది. యువనేతను చూసేందుకు మహిళలు, యువత, వృద్దులుభారీగా రోడ్లపైకి తరలివచ్చి, సమస్యలను విన్నవించారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది. ప్రతి యూనిట్ పై జే ట్యాక్స్ వేస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల భారం తగ్గిస్తామని భరోసా ఇచ్చారు. మార్గమధ్యలో అందుకూరు గ్రామస్తులు లోకేష్ ను కలిసి ఎదువాగుపై హైలెవల్ చప్టా నిర్మించాలని, క్రోసూరు నుంచి అందుకూరు మీదుగా పెదకూరపాడు వెళ్లేందుకు బస్ సౌకర్యం కల్పించాలని కోరారు. అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. 181వరోజు యువనేత లోకేష్ 9.5 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2420 కి.మీ.ల మేర పూర్తయింది. శనివారం సాయంత్రం యువగళం పాదయాత్ర తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.
వైసిపి రౌడీలపై కేసు పెట్టలేదే?
డిఐజి అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్ రెడ్డి కి వైసిపి వాళ్ళు వేసిన రాళ్లు కనపడలేదు. వైసిపి రౌడీల మీద ఒక్క కేసు లేదు. వారిద్దరూ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ అన్ని గుర్తుపెట్టుకుని రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.
అమరావతి నేలపై పాదయాత్ర అదృష్టం
యువగళం..మనగళం..ప్రజాబలం. వినుకొండ అదిరిపోయింది. మాచర్ల మాస్ దెబ్బ అదుర్స్. గురజాల దద్దరిల్లింది, సత్తెనపల్లి కదం తొక్కింది. పెదకూరపాడు జనసంద్రంగా మారింది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పాలించిన గడ్డ పెదకూరపాడు. శాతవాహనులు ఏలిన నేల పెదకూరపాడు. గౌతమబుద్ధుడు నడయాడిన ప్రాంతం ఇది. అమరేశ్వర స్వామి దేవాలయం, వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి పెదకూరపాడు. ఇంద్రుడు రాజధాని అమరావతి, మన చంద్రుడు ప్రజారాజధాని అమరావతి. ఈ పవిత్రమైన ప్రాంతంలో పాదయాత్ర చేయడం నా అదృష్టం.
కులం, మతం పేరుతో నీచమైన కుట్ర
అమరావతి ని స్మశానం అన్నాడు, అమరావతిలో భూకంపాలు వస్తాయి అన్నాడు, వర్షం వస్తే మునిగిపోతుంది సుదీర్ఘ పోరాటం చేసి సైకో కి సినిమా చూపించారు అమరావతి రైతులు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసిపి నాయకులకు సిగ్గుందా? అమరావతిని చంపేస్తుంటే వీళ్లు చప్పట్లు కొట్టారు. అసలు మీరు పుట్టింది గుంటూరు నేల పైనేనా? పుట్టిన నేలకి ద్రోహం చేసిన దుర్మార్గులు వైసిపి గుంటూరు జిల్లా నేతలు. పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం.
దమ్ముంటే బిల్లులపై స్టిక్కర్లు వేయాలి
అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు.
మహిళలను ఆదుకునేందుకే మహాశక్తి
2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.
యువత భవితను దెబ్బకొట్టిన జగన్!
వైసీపీ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టారు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని వైసీపీ కోరుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
రైతుల కోసం అన్నదాత పథకం
వైసీపీ రైతులు లేని రాజ్యం తెస్తున్నారు . జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
పోలీసుల డబ్బునూ కొట్టేశాడు!
జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్ఐ కి 10 వేలు, సిఐకి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు. జగన్ తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యధాతధంగా ఇస్తాం.
బిసిల కోసం ప్రత్యేకరక్షణ చట్టం
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.
పెదకూరపాడును అభివృద్ధి చేసింది టిడిపి
పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. రూ.1000 కోట్లతో పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. తాగు, సాగు నీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, టిడ్కో ఇళ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, సిసి రోడ్లు, డబుల్ రోడ్లు నిర్మించింది TDP కానీ మీరు ఎం చేసారు? పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. పెదకూరపాడుని అభివృద్ధి లో నంబర్ 1 చేస్తారని మీరు నంబూరు శంకర్రావుని గెలిపించారు. కానీ జరిగింది ఏంటి? పెదకూరపాడులో అభివృద్ధి నిల్లు.. అవినీతి ఫుల్లు. పెదకూరపాడు ని ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ మాఫియా కి అడ్డాగా మార్చేసారు.
శాండ్ శంకర్ దోపిడీ పర్వం
ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి తెలుసుకున్న తరువాత నంబూరు శంకర్రావు పేరు మార్చాను. శ్యాండ్ శంకర్ అని పేరు పెట్టా. ఉమ్మడి గుంటూరు జిల్లా ఇసుక రీచ్లు అన్ని శ్యాండ్ శంకర్ కబ్జా చేసాడు. ఈయన ఇసుక దాహానికి కృష్ణా నది ఇసుక గుంతల్లో పడి 22 మంది చనిపోయారు. ఇందులో విద్యార్థులు, చిన్నారులు కూడా ఉన్నారు. ప్రజల్ని చంపినా, రోడ్లు నాశనం చేసినా ఆయన్ని ఎవరూ ఆపరు. ప్రతి నెలా రూ.20 కోట్లు ఇసుక వాటా పంపుతున్నాడు. శ్యాండ్ శంకర్, ఆయన అనుచరులు సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరకి రైతుల దగ్గర భూములు కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మేసారు. ఏకంగా బ్యాంక్ తనఖాలో ఉన్న భూమిని కూడా ప్రభుత్వానికి అమ్మేసాడు. ఆ బ్యాంకు సిబ్బంది సీబీఐకి ఫిర్యాదు చేసారు. వీళ్ల ధనదాహానికి ఇంఛార్జ్ తహసీల్దార్ గా ఉన్న మహిళా అధికారి సస్పెండ్ అయ్యారు. పవిత్రమైన వైకుంఠపురం కొండకు గుండు కొట్టాడు. ఈ కొండపై ఉన్న దేవాలయాన్ని టిటిడి లో కలపాలని టిడిపి ప్రభుత్వం ఆలోచిస్తే, ఇప్పుడు ఏకంగా కొండనే మింగేస్తున్నాడు చెరువులు, వాగుల్లో మట్టి లేపేస్తున్నారు.
ఏ రోడ్డు వేయాలన్నా ఎమ్మెల్యే కంపెనీనే!
శ్యాండ్ శంకర్ అవినీతి లో ఎక్స్ పర్ట్. వీళ్లకి గోదావరి, పెన్నా నదులు అనుసంధానం చేసే ప్రాజెక్టు కట్టడం చేతకాదు. కానీ ఈ ప్రాజెక్టు కింద వచ్చే భూములను అనుచరులతో తక్కువ రేటుకి కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకి అమ్మాలని స్కెచ్ వేసాడు. నియోజకవర్గం లో ఏ రోడ్డు వెయ్యాలన్నా ఎమ్మెల్యే పార్ట్నర్ గా ఉన్న కంపెనీ వెయ్యాలి. రెండు కోట్ల ఆరు లక్షలతో వేసిన పెదకూరపాడు అత్తలూరు రోడ్డు ఆరు నెలలకే ధ్వంసం అయింది. రేషన్ బియ్యాన్ని కూడా అక్రమంగా తరలిస్తున్నాడు శ్యాండ్ శంకర్రావు. శ్యాండ్ శంకర్, ఆయన కుమారుడు చక్రవర్తి చెప్పిందే అధికారులు చెయ్యాలి లేకపోతే సస్పెండ్ చేయిస్తారు. ఒక ఎంపీడీవోని ట్రాన్స్ ఫర్ చేయించారు. ఒక ఎస్సై ని సస్పెండ్ చేయించారు. టిడిపి వాళ్ళ పై కేసులు పెట్టలేదని సిఐ లని, ఎస్ఐ లని విఆర్ కి పంపారు. క్రోసూరు మండలంలోని పెరికపాడు గ్రామంలో అటవీ భూమిని శ్యాండ్ శంకర్ ప్రోత్బలంతో అనుచరులు సుమారు 400 ఎకరాలు ఆక్రమించి వాటిని చదును చేసి అమ్ముకోవడం ప్లాట్లుగా చేసి విక్రయించడం చేస్తున్నారు. శాండ్ శంకర్ కి సిగ్గుంటే రాజీనామా చేసేవాడు. అమ్మలాంటి అమరావతిని జగన్ చంపేస్తుంటే చప్పట్లు కొట్టిన దుర్మార్గుడు శ్యాండ్ శంకర్.
తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
2024 లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం. పెదకూరపాడు లో టిడిపిని భారీ మెజారిటీ తో గెలిపించండి. నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. డ్రైనేజ్ లు లేక గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఎన్ఎస్పీ కెనాల్ ద్వారా ఎత్తిపోతల పథకం నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంక్స్ అన్ని పాడైపోయాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తాం. మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు నేను చూసాను. మీ పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు కల్పించే బాధ్యత నాది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. టిడిపి హయాంలో రూ.24 కోట్లతో నేషనల్ డీఎన్ఏ ల్యాబ్, రీజనల్ కోడింగ్ సెంటర్, పెస్టిసైడ్ ల్యాబ్, ఫర్టిలైజర్ ల్యాబ్ వంటి ల్యాబ్ లకు అవసరమైన భవనాలను కడితే ఈ ప్రభుత్వం వాటిని ప్రారంభించకుండా వదిలేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం.
వైకుంఠపురం బ్యారేజి పూర్తిచేస్తాం
పెన్నా, గోదావరి అనుసంధానం, రూ.2200 కోట్లతో వైకుంఠపురం బ్యారేజిని ఈ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పెదకూరపాడు, రుద్రారం గ్రామాలకు ఎతిపోతల పధకాలు నిర్మిస్తాం అని జగన్ హామీ ఇచ్చి ఇంత వరకూ కనీసం మంజూరు కూడా చేయలేదు, మేము అధికారం లోకి వస్తే వెంటనే నిర్మిస్తాం. అమరావతి నుండి బెల్లంకొండ మధ్య డబుల్ రోడ్లు, మాదిపాడు నుండి ముక్త్యాల వరకూ ఫ్లైఓవర్, మద్దూరు గ్రామంలో ఉన్న కాలువకి ఫ్లైఓవర్ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం. పెదకూరపాడు పెద్ద మనిషి కొమ్మాలపాటి శ్రీధర్ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉందో ఒక్క సారి ఆలోచించండి. శాండ్ శంకర్రావు ఇసుక దందా పై ఎన్జిటిలో పోరాడింది కొమ్మాలపాటి శ్రీధర్. కోవిడ్ వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలకు అండగా నిలిచారు. టిడిపి కార్యకర్తలు, నాయకుల్ని వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తా. పెదకూరపాడులో ఉన్నా విదేశాలకి పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. నాలుగేళ్లు ఓపిక పట్టాం. ఇక ఊరుకునేది లేదు. బీ కేర్ ఫుల్. మా నాయకుడు జోలికి వస్తే జరగబోయే పరిణామాలకు జగనే కారణమవుతారు.
నారా లోకేష్ ను కలిసిన అందుకూరు గ్రామస్తులు
పెదకూరపాడు నియోజకవర్గం అందుకూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఎద్దువాగుపై లో లెవల్ చప్టాఉంది. దీని గుండా 5 గ్రామాల వరద నీరు వస్తుంది. వరద ప్రవాహంతో ఇప్పటిదాకా 20 మంది చనిపోయారు. లోలెవల్ చప్టా స్థానంలో హై లెవల్ బ్రిడ్జిని నిర్మించాలి. మా గ్రామంలో స్మశానానికి వెళ్లేందుకు సరైన దారిలేదు…మీ ప్రభుత్వం వచ్చాక రహదారి నిర్మించాలి. గ్రామంలో సైడు కాల్వలు లేకపోవడంతో నీరు నిలిచిపోతోంది..దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. అందుకూరు గ్రామం నుండి సత్తెనపల్లి మండలం గోరంట్ల వెళ్లే రోడ్డు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం. క్రోసూరు నుండి అందుకూరు మీదుగా పెదకూరపాడు వెళ్లేందుకు బస్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం…బస్ సౌకర్యం కల్పించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
వైసీపీ కు ఇసుక దోపిడీపై ఉన్న శ్రద్ధ నదీతీర ప్రాంత ప్రజల సమస్యలపై లేదు. TDP అధికారంలోకి వచ్చాక ఎద్దువాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తాం. అందుకూరు స్మశానానికి వెళ్లేందుకు రహదారి ఏర్పాటుచేస్తాం. గ్రామాల్లో నాలుగేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది… రూ.9 వేల కోట్ల పంచాయతీ నిధులను ప్రభుత్వం దొంగిలించింది. టీడీపీ రాగానే గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో రోడ్ల నిర్మాణలు జరగడం లేదు..పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. దివాలాకోరుపాలనలో రోడ్లపై తట్టమట్టిపోసే దిక్కులేదు. అందుకూరు నుండి గోరంట్ల వెళ్లే రోడ్డును నిర్మిస్తాం. క్రోసూరు నుండి అందుకూరు మీదుగా పెదకూరపాడుకు బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం.
Also Read this Blog: Journeying Together: Reflections on Naralokesh’s Padayatra
Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh